Supreme Court | మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న రెండు కీలక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనున్నది. రెండు ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ పార్టీ నేతల మధ్య విభేదాలతో రెండువర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య ఎన్నికల గుర్తుల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంలో సుప్రీంకోర్టు జనవరి 21న తుది విచారణ జరుపనున్నది. ఏక్నాథ్ షిండే వర్గాన్ని శివసేనగా గుర్తించి.. విల్లు, బాణం ఎన్నికల గుర్తులను ఈసీ కేటాయించడాన్ని సవాల్ చేస్తూ శివసేన (UBT) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం తుది విచారణను వాయిదా వేసింది.
ఎన్సీపీ (అజిత్ పవార్)కి ఈసీ గడియారం గుర్తును కేటాయించడాన్ని ఎన్సీపీ (శరద్ పవార్) దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. రెండు కేసుల్లోని అంశాలను గుర్తించి.. రెండు కేసులను కలిపి విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో వచ్చే ఏడాది జనవరి 21న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే జనవరి 22న విచారణ కొనసాగించేందుకు వీలుగా.. మరుసటి రోజు ఇతర అత్యవసర అంశాలపై జాబితా చేయొద్దని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. శివసేన (UBT) సీనియర్ తరఫున అభిషేక్ మను సింఘ్వి, దేవదత్ కామత్ హాజరయ్యారు. మరో వైపు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, ఎన్కే కౌల్ హాజరయ్యారు.
పార్టీ పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించాలనే ఈసీ నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) విమర్శించింది. 2022లో శివసేనలో రాజకీయ సంక్షోభం తర్వాత.. ఫిబ్రవరి 2023లో షిండే నేతృత్వంలోని వర్గానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వును జారీ చేసింది. పార్టీలో మెజారిటీని నిర్ణయించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ విఫలమైందని.. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో షిండే వర్గం బలం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసిందని ఉద్ధవ్ థాకరే వర్గం వాదించింది. ఈ విషయం పెండింగ్‌లో ఉండగా శివసేన (UBT), బర్నింగ్ టార్చ్ గుర్తును ఉపయోగించాలని ఉద్ధవ్ థాకరే వర్గానికి సుప్రీంకోర్టు సూచించింది. అలాగే, శరద్ పవార్ వర్గం సైతం 2024లో అజిత్ పవార్‌కు గడియారం గుర్తును కేటాయించాలనే ఈసీ నిర్ణయాన్ని శరద్ పవార్ వర్గం సవాల్ చేసింది. సుప్రీం కోర్టు శరద్ పవార్ వర్గానికి ట్రంపెట్ గుర్తును కేటాయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.