న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. అధికారుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, వారి నిష్క్రియాత్మకత కారణంగా సరిగ్గా జంతు నియంత్రణ చర్యలు కొనసాగలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి మున్సిపాల్టీలు, ఇతర సంస్థలకు జారీ చేసిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించడానికి ధర్మాసనం తిరస్కరించింది.
అంతకు ముందు కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ‘కుక్క కాట్ల వల్ల పిల్లలు మరణిస్తున్నారు. స్టెరిలైజేషన్తో రేబిస్ కట్టడి కావడం లేదు. ప్రతి ఏటా 37 లక్షల మంది కుక్క కాట్లకు గురవుతున్నారు, అంటే సగటున ప్రతి రోజూ 10 వేల మంది బాధపడుతున్నారు. అలాగే ప్రతి ఏడాది 20 వేల రేబిస్ మరణాలు సంభవిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డాటా వెల్లడిస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు.