న్యూఢిల్లీ, డిసెంబర్ 28: డిమాండ్ల సాధనకు నెల రోజులుగా దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ను ఇంకా దవాఖానకు తరలించకపోవడం పట్ల సుప్రీం కోర్టు శనివారం పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తమ కోసం దీక్ష చేస్తున్న నేతకు వైద్య సహాయం అందకుండా చేస్తున్న రైతుల ఉద్దేశంపై కోర్టు అనుమానాన్ని వ్యక్తం చేసింది.
అలాంటి వారు ఆయన శ్రేయోభిలాషులు కాదని వ్యాఖ్యానించింది. డల్లేవాల్ దీక్షపై శనివారంనాటి విచారణలో ఆయనను దవాఖానకు తరలించడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్టు సెలవు బెంచ్ జడ్జీలు సూర్యకాంత్, సుధాంశు ధులియా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే కేంద్రం సహాయాన్ని తీసుకోవచ్చునని పేర్కొన్నారు. డల్లేవాల్ను దవాఖానకు తరలించడంపై పంజాబ్ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. వైద్య చికిత్సకు నిరాకరిస్తున్నారని, ఆయన చుట్టూ రైతులు రక్షణగా ఉండటంతో దవాఖానకు తీసుకెళ్లలేకపోతున్నామని కోర్టుకు విన్నవించారు.