హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): చిన్న పిల్లల అదృశ్యం కేసులు రోజురోజుకూ పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విచారణ లేకుండానే వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్ని రాష్ర్టాల పోలీసులను ఆదేశించింది. తప్పిపోయిన పిల్లలను గుర్తించే యంత్రాంగాలను బలోపేతం చేయడానికి, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడానికి ఈ సందర్భంగా ధర్మాసనం మార్గ దర్శకాలు జారీ చేసింది.
పిల్లల కిడ్నాప్‌నకు సంబంధించి న్యాయ సంహితలోని నిబంధనలను ఎఫ్ఐఆర్లో తప్పనిసరిగా ప్రస్తావించాలని పేర్కొంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పోలీసులు నాలుగు నెలల గడువు కోసం ఎదురు చూడకుండా కేసును యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లకు బదిలీ చేయాలని ఆదేశించింది.