న్యూఢిల్లీ: బాలుడి కస్టడీ అంశంపై సుప్రీంకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసింది. రష్యా మహిళ, ఆమె కుమారుడి గురించి వెతకాలని, వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలని విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. భారతీయ తండ్రికి అతడి కుమారుడ్ని అప్పగించాలని పేర్కొంది. (Russian Woman, Child) భారతీయుడైన సైకత్ బసు చైనాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుండగా రష్యాకు చెందిన విక్టోరియాతో పరిచయం ఏర్పడింది. దీంతో 2017లో వీరిద్దరూ భారత్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.
కాగా, సైకత్ బసు, విక్టోరియా విడాకుల కోసం ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ పెండింగ్‌లో ఉన్నది. ఐదేళ్ల కుమారుడు వారంలో మూడు రోజులు తల్లి వద్ద ఉండేందుకు కోర్టు అనుమతించింది. దీంతో మే 22న చివరిసారి కుమారుడ్ని తన కస్టడీలోకి విక్టోరియా తీసుకున్నది. అనంతరం ఆ బాలుడితోపాటు ఆమె అదృశ్యమైంది.
మరోవైపు కుమారుడ్ని తనకు అప్పగించాలంటూ సైకత్ బసు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జూలై 4న ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలోకి బ్యాగులతో ఆమె వెళ్లడం కనిపించిందని కోర్టుకు తెలిపాడు. రాయబార కార్యాలయ అధికారి కూడా ఆమె వెంట ఉన్నాడని, అతడితో ఆమెకు సంబంధం ఉన్నదని ఆరోపించాడు. తన కుమారుడితో కలిసి భారత్ నుంచి ఆమె పారిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.
కాగా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం సైకత్ బసు పిటిషన్‌పై విచారణ జరిపింది. రష్యా మహిళ విక్టోరియా ఎక్కడ ఉన్నదో తెలియదన్న ఆమె తరుఫు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదృశ్యమైన అతడి కుమారుడ్ని కనుగొని తండ్రి కస్టడికి అప్పగించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
మరోవైపు రష్యా మహిళ విక్టోరియా కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో ఆమె కోసం నిఘా పెట్టాలని పేర్కొంది. రష్యా మహిళ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఆమెకు సహకరించిన ఢిల్లీలోని రష్యా రాయబారి ఇంటిని సోదా చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి కోరాలని కోర్టు సూచించింది.
Also Read:
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?