న్యూఢిల్లీ, జూలై 24: రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వాలకు మధ్య విశ్వాసం లోపించినట్టు కనిపిస్తున్నదని అభిప్రాయపడింది. రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు సూచించింది. ప్రభుత్వం, రైతుల మధ్య విశ్వాసాన్ని కలిగించేందుకు ‘తటస్థ అంపైర్లు’ ఉండాల్సిన అవసరం ఉన్నదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం పేర్కొన్నది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని రెండు ప్రభుత్వాలకు సూచించింది. హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద అడ్డుకట్టల్ని తొలగించాలన్న పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. డిమాండ్ల సాధన కోసం రైతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్‌ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం శంభు సరిహద్దు హైవేను దిగ్బంధించింది. బారికేడ్లు, ఇతర అడ్డంకులను ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో రైతులు అక్కడే ఆందోళనకు దిగారు.
విచారణ సందర్భంగా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించేందుకు ఏమైనా చొరవ తీసుకొన్నారా? అని ప్రశ్నించింది. ‘మీ మంత్రులు స్థానిక సమస్యలు తెలియకుండా రైతుల వద్దకు వెళ్లి ఉండొచ్చు. అక్కడే రైతులకు, ప్రభుత్వానికి విశ్వాసం లోపం కనిపిస్తున్నది. కొంత మంది తటస్థ అంపైర్లు ఎందుకు ఉండకూడదు? ఇద్దరి మధ్య విశ్వాసాన్ని కలుగజేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. శంభు సరిహద్దు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా బారికేడ్ల తొలగింపుపై ఒక ప్రణాళికను ప్రతిపాదించాలని సూచించింది.
రైతులను ఢిల్లీలోకి అనుమతిస్తే, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ ‘ మీరు(ప్రభుత్వం) కొంత ప్రయత్నం చేయాలి. అన్నిటి కంటే ముందు మీరు రైతుల వద్దకు వెళ్లాలి. లేకుంటే వారు(రైతులు) ఎందుకు ఢిల్లీ రావాలని అనుకొంటారు?’ అని పేర్కొన్నది. రైతులను తమ ట్రాక్టర్లు, ఇతర వాహనాలను సాయుధ ట్యాంకులుగా మార్చారని మెహతా పేర్కొనగా.. ‘మీరు చేస్తున్న వాదనలు కూడా విశ్వాస లోపాన్ని చూపిస్తున్నాయి’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ విఫలమైందని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ల సాధన కోసం ఢిల్లీకి మార్చ్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పంజాబ్, హర్యానా, యూపీ పలు ఇతర రాష్ర్టాలకు చెందిన నేతలు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కలిసారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చించారు. ఎంఎస్పీకి చట్టబద్ధతను సాధించేందుకు ప్రభుత్వంపై విపక్ష ఇండియా కూటమి ఒత్తిడి తీసుకొస్తుందని రాహుల్ పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధర దక్కడం రైతుల హక్కు అని, ఆ హక్కు వారికి దక్కేలా కృషి చేస్తామని అన్నారు.