న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భార్యతో బలవంతంగా శృంగారం జరిపే భర్తను శిక్ష నుంచి తప్పిస్తున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలకు ఉన్న రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటుపై నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. భార్య సమ్మతి లేకుండా బలవంతంగా శృంగారం జరిపే భర్తకు శిక్ష విధిస్తే వారి మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, వివాహ వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుందన్న కేంద్ర ప్రభుత్వ వాదనపై సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయాలు కోరింది.
ఈ కేసుపై సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ముందుగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కరుణా నంది తన వాదనలు వినిపిస్తూ.. ఐపీసీ, బీఎన్ఎస్లోని నిబంధనలను ప్రస్తావించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. మనముందు రెండు తీర్పులు ఉన్నాయని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ముఖ్యంగా ఆ నిబంధనలకున్న రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటును పరిశీలించాల్సి ఉందని చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేకమైన నిబంధనను కొట్టివేయాలని కరుణా నంది సూచించారు. వివాహంలో బలవంతపు శృంగారం నేరం కాదంటున్న ఐపీసీ, బీఎన్ఎస్లోని నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ని ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. 18 ఏండ్లు నిండిన భార్యపై ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా భర్త జరిపే లైంగిక సంపర్కాన్ని మినహాయించింది కదా అని గుర్తుచేసింది. ఒకవేళ తాము ఆ నిబంధనను కొట్టివేస్తే.. భర్త చేసేది నేరం అవుతుందని, దానిని లైంగిక దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనిని ప్రత్యేకమైన నేరంగా పరిగణించాలా లేక ఆ మినహాయింపుకున్న చెల్లుబాటును నిర్ధారించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.