న్యూఢిల్లీ, ఫిబ్రవరి13: ఉత్తరప్రదేశ్లో అక్రమ ఆయుధాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం కలవరపరిచే ధోరణి అని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్లోని ఖేక్ర ప్రాంతంలో 2017లో అక్రమ ఆయుధంతో కాల్పులు జరిపి ఒకరిని హత్య చేశారనే కేసులో రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి నిందితుడు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు నిందితుడి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం.. అక్రమ ఆయుధాల అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. పౌరులు ఆయుధాలు కలిగి ఉండేలా అమెరికా రాజ్యాంగం ఇచ్చిన హక్కును మన రాజ్యాంగం ఇవ్వలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారో, అక్రమ ఆయుధాలను నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.