కేసులు పెడితే సరిపోదు
దేశంలో పెచ్చరిల్లిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాల ఘటనలపై ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
- విద్వేష ప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ఎఫ్ఐఆర్తో పరిష్కారం రాదు
- సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మార్చి 28: దేశంలో పెచ్చరిల్లిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాల ఘటనలపై ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించి కేవలం కేసులు నమోదు చేస్తే సరిపోదని, తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది.
కేసుల నమోదు తర్వాత ఎలాంటి చర్యలు తీసుకొన్నారో చెప్పాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. దేశంలో మత సామరస్యం కొనసాగించాలంటే విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాల ఘటనలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
దోషులు పార్టీ నడుపకుండా నిషేధించాలి
- సుప్రీంకోర్టులో పిల్
ఏదైనా కేసులో దోషిగా తేలిన వ్యక్తులు ఎన్నికల చట్టాల ప్రకారం అనర్హులుగా ఉన్నంత కాలం రాజకీయ పార్టీని స్థాపించకుండా, నడుపకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మే నెల మొదటి వారంలో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆ కాలవ్యవధిలో దోషులు ఆఫీస్ బేరర్లుగా ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్దారు కోరారు. ఇదే సమయంలో ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని ‘సెక్షన్ 29ఏ’ను అహేతుకమైనదిగా ప్రకటించాలని అభ్యర్థించారు. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, ఎన్నికలో పోటీ చేయకుండా నిషేధం విధించిన వ్యక్తులు ఇప్పటికీ పార్టీలు నడుపుతున్నారని, పార్టీలోని పదవుల్లో కొనసాగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దోషులుగా తేలిన వ్యక్తులు తమ పార్టీ నుంచి ఎవరు చట్టసభల సభ్యులుగా ఎన్నిక అవ్వాలో నిర్ణయిస్తున్నారని తన పిల్లో పేర్కొన్నారు.
ధన్కర్, రిజిజును డిస్క్వాలిఫై చేయండి
- సుప్రీంను ఆశ్రయించిన బాంబే లాయర్స్ అసోసియేషన్
న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాంబే లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం రిట్ అధికార పరిధిని అమలుచేయడం సరికాదనే కారణంతో తమ పిటిషన్ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు ఫిబ్రవరి 9న ఇచ్చిన ఆదేశాలను అసోసియేషన్ సవాల్ చేసింది. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు లాయర్ అహ్మద్ అబ్ది తెలిపారు. రిజిజు, ధన్కర్ తమ వ్యాఖ్యలు, ప్రవర్తనతో రాజ్యాంగంపై వారికి విశ్వాసం లేదని నిరూపించుకొన్నారని అసోసియేషన్ పేర్కొంది. ఉపరాష్ట్రపతిగా ధన్కర్, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రిజిజు బాధ్యతలు నిర్వర్తించకుండా వారిని నిరోధిస్తూ ఆదేశాలు జారీచేయాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

