న్యూఢిల్లీ: బెయిల్ దరఖాస్తులపై విచారణను సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టే సంప్రదాయంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కనీసం ఒక రోజు ఆలస్యం జరిగినా, ప్రజల ప్రాథమిక హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పింది. తన బెయిల్ దరఖాస్తును అలహాబాద్ హైకోర్టు గత ఏడాది ఆగస్టు నుంచి పెండింగ్లో పెట్టిందని ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదే పదే కేసును వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా పడిన విషయాన్ని తెలుసుకుని, అదే రోజున విచారణ జరపాలని హైకోర్టు జడ్జిని సుప్రీంకోర్టు కోరింది. రెండు వారాల్లోగా తీర్పు వెల్లడించాలని చెప్పింది.