న్యూఢిల్లీ, మే 22: న్యాయస్థానాలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరతపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత కారణంగానే న్యాయం లభించడంలో జాప్యం జరుగుతున్నదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ర్టాలే ఏమీ చేయకుండా కేవలం క్రిమినల్ న్యాయం ఆలస్యం అవుతున్నదని అంటున్నాయి.
అసలు సమస్య ఎక్కడ ఉంది? ప్రతి రాష్ట్రంలోని ప్రాసిక్యూటర్ డైరెక్టరేట్ వీటన్నిటినీ ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ప్రాసిక్యూషన్ విచారణలను సకాలంలో నిర్వహించడం లేదు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు అని ధర్మాసనం పేర్కొన్నది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై న్యాయ వ్యవస్థ సూచనలు చేస్తుందని.. అయితే వాటి అమలు ప్రభుత్వాల చేతిలో ఉంటుందని కోర్టు తెలిపింది.