Justice Oka | సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తన చివరి పని దినమైన శుక్రవారం రోజున 11 తీర్పులను వెలువరించారు. అయితే, ఆయన తల్లి కొద్దిగంటల కిందటే కన్నుమూశారు. జస్టిస్ ఓకా గురువారం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ముంబయి వెళ్లి శుక్రవారం విధులకు హాజరై వృత్తిపట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. జస్టిస్ ఓకా శుక్రవారం తన సాధారణ బెంచ్‌లో 11 తీర్పులు వెలువరించారు. ఆ తర్వాత సీజేఐతో కలిసి సెర్మోనియల్ బెంచ్‌లో కూర్చున్నారు. మే 21న సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA) నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో పదవీ విరమణ చేసే న్యాయమూర్తుల చివరి పని దినం రోజున పని చేయకూడదనే సంప్రదాయంతో తాను ఏకీభవించనని జస్టిస్ ఓకా అన్నారు.
ఆ రోజు మధ్యాహ్నం వరకు కాకుండా.. పూర్తిగా పని చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ న్యాయమూర్తిని భోజనం తర్వాత వెంటనే ఇంటికి ఎందుకు పంపాలని ఆయన ప్రశ్నించారు. ఈ సంప్రదాయాన్ని మార్చాలని.. తద్వారా న్యాయమూర్తి చివరి పనిదినం సాయంత్రం 4గంటల వరకు పని చేయడంలో సంతృప్తిని పొందుతారన్నారు. పదవీ విరమణ అనే పదాన్ని తాను ద్వేషిస్తానని, జనవరి నుండి వీలైనన్ని ఎక్కువ కేసులను విచారించాలని నిర్ణయించుకున్నానని జస్టిస్ ఓకా పేర్కొన్నారు.
జస్టిస్ ఓకా మే 25, 1960న జన్మించారు. ఆయన బాంబే విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. జూన్ 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆయన తన తండ్రి శ్రీనివాస్ డబ్ల్యూ ఓకా వద్ద థానే జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. 1985-86లో ఆయన మాజీ బాంబే హైకోర్టు న్యాయమూర్తి, మాజీ లోకాయుక్త వీపీ టిప్నిస్ ఛాంబర్లో పనిచేశారు. ఆయన ఆగస్టు 29, 2003న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఆయన 2019 మే 10న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 31 ఆగస్టు 2021న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అప్పటినుంచి వివిధ ధర్మాసనాల్లో మొత్తంగా 295 తీర్పులు వెలువురించారు. వివిధ ధర్మాసనాల్లో వెయ్యి తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టులు తిరస్కరించడంపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలోనూ వలస కార్మికుల హక్కుల రక్షణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం వారిపై అనుసరించిన వైఖరిని జస్టిస్ ఓకా ప్రశ్నించారు.