న్యూఢిల్లీ, ఆగస్టు 22 : ఢిల్లీ-ఎన్సీఆర్లోని వీధి కుక్కల తరలింపుపై తన ఇదివరకటి తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీచేసింది. స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ తర్వాత వీధి కుక్కలను వాటిని తెచ్చిన వీధులలోనే విడిచిపెట్టాలని మున్సిపల్ అధికారులను జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే రేబిస్ సోకిన లేదా ఉన్మాద లక్షణాలు ప్రదర్శిస్తున్న వీధి కుక్కలను మాత్రం షెల్టర్ హోంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్కలకు వీధుల్లో ప్రజలు ఆహారం పెట్టడాన్ని అనుమతించబోమని, వీధికుక్కల కోసం ఆయా ప్రాంతాలలో ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపింది.
మున్సిపల్ వార్డులలో వీధికుక్కల కోసం ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)ని ధర్మాసనం ఆదేశించింది. వీధి కుక్కల దత్తత కోసం జంతు ప్రేమికులు ఎంసీడీకి దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. వీధి కుక్కల బెడదకు సంబంధించిన పరిశీలనాంశాల పరిధిని విస్తరించిన సుప్రీంకోర్టు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఓ జాతీయ విధానాన్ని రూపొందించడంపై తమ స్పందనను తెలియచేయవలసిందిగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పశు సంవర్థ్ధక శాఖల కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. వీధి కుక్కలకు సంబంధించి రాష్ర్టాల హైకోర్టులలో ఏవైనా పిటిషన్లు పెండింగ్లో ఉంటే వెంటనే వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరాలని రిజిస్ట్రీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లోని వీధి కుక్కలను షెల్టర్ హోంలకు తరలించాలని ఆదేశిస్తూ ఇదివరకు జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించినందుకు సుప్రీంకోర్టుకు దేశంలోని జంతు హక్కుల పరిరక్షణ సంస్థ పెటా(పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఫర్ యానిమల్స్) ధన్యవాదాలు తెలియచేస్తూ ప్రతి కుక్కకు ఓ రోజొస్తుంది అంటూ ప్రకటించింది.
టీ స్టాల్ దగ్గరున్న షేరూ, గుడి మెట్ల మీదున్న రాణి, సొసైటీ మైదానంలో ఉన్న మోతీదే ఈరోజు అని దేశంలో జంతు హక్కుల కోసం పోరాడుతున్న పెటా ఎక్స్ వేదికగా శుక్రవారం వ్యాఖ్యానించింది. వీధి కుక్కల కోసం ప్రజలు శుభ్రమైన పాత్రలలో మంచినీరు అందచేయాలని, ప్రతి వీధిలో కుక్కలకు ఆహారం లభించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది.