న్యూఢిల్లీ: వీధి కుక్కలకు సంబంధించి సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, జంతు ప్రేమికురాలు మేనకా గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చర్యలు కోర్టు ధిక్కారమే అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలిపివేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నించింది.
‘వ్యాఖ్యలు చేసేటప్పుడు కోర్టు జాగ్రత్తగా ఉండాలని మీరు అంటుంటారు కదా. కానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మేనకాగాంధీ చేసిన వ్యాఖ్యలను మీరు విన్నారా? అప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్‌ను గమనించారా?’ అని ఆమె తరపు న్యాయవాది రామచంద్రన్‌ను కోర్టు ప్రశ్నించింది. బడ్జెట్ కేటాయింపు అన్నది విధాన నిర్ణయమని పేర్కొన్న న్యాయవాది.. తాను పాక్ ఉగ్రవాది కసబ్ తరపున కూడా వాదించిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోర్టు ‘కసబ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ లేదు. కానీ మీ క్లయింట్ పాల్పడ్డారు’ అని వ్యాఖ్యానించింది.