న్యూఢిల్లీ, జనవరి 2: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లో ఎన్నో లోపాలున్నాయని, తమకు 50 సీల్డ్ ఈవీఎంలు అప్పగిస్తే.. అందులోని అక్రమాల్ని బయటపెడతామని సుప్రీంకోర్టు న్యాయవాదుల గ్రూప్ ఒకటి కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విసిరింది. ఈ అంశానికి సంబంధించి జనవరి 5న పాటియాలా హౌస్ కోర్టు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి న్యాయవాదుల గ్రూప్ పాదయాత్ర చేపట్టింది. ఈవీఎం లోపాల్ని బయటపెట్టే నిమిత్తం తమకు 50 సీల్ వేసిన మెషీన్లు ఇవ్వాలని కోరుతూ ఓ పిటిషన్ ఈసీకి ఇవ్వబోతున్నది. మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో న్యాయవాదుల గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ, ‘కేంద్ర ఎన్నికల సంఘం తనంత తానుగా 2017 లో సవాల్ విసిరింది. ఈవీఎం మెషీన్ల హ్యా కింగ్, లోపాలు బయటపెట్టాలని కోరింది. ఈ నేపథ్యంలో మాకు ఓ 50 సీల్డ్ మెషీన్లు ఇస్తే, వాటిని ఆయా రాష్ర్టాల రాజధానులకు తీసుకెళ్తాం. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో ఈవీఎం లోపాల్ని అందరిముందు బయటపెడతాం. మెషీన్ల ఎలా హ్యాకింగ్ చేయొచ్చో మీడియా, ప్రజల ముందు చూపుతాం’ అని అన్నారు.