ఇంఫాల్, మార్చి 22: కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల సాయంతో ప్రస్తుత కష్టకాలాన్ని మణిపూర్ రాష్ట్రం త్వరలోనే అధిగమించి మునుపటి వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యక్తం చేశారు.
ఆరుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో కూడిన బృందం శనివారం కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో పర్యటించింది. చురాచాంద్పూర్లోని సహాయ శిబిరాన్ని బృందం సందర్శించింది. న్యాయ సేవల విభాగాన్ని, వైద్య శిబిరాన్ని, న్యాయ సహాయ క్లినిక్లను వారు వర్చువల్గా ప్రారంభించారు. మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు పర్యటిస్తారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు శనివారం మణిపూర్ను సందర్శించడాన్ని ఆయన స్వాగతించారు.