గుంటూరు: జిల్లా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కీలకమని, ఈ నేపథ్యంలో జిల్లా జడ్జీలు సంక్లిష్ట సమయాల్లోనూ ప్రశాంతంగా ఉండాలని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. ఆదివారం ఆయన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ‘రాజ్యాంగ దార్శనికతను నిలబెట్టడంలో జిల్లా న్యాయ స్థానాల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు.
న్యాయ వ్యవస్థలోని ప్రతి అంశం రాజ్యాంగంలో పేర్కొన్న ఆదర్శాల ప్రకారం పని చేయాలని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ న్యాయ వ్యవస్థ విశాలమైనదన్నారు. నాణ్యమైన తీర్పులు ఇవ్వడం న్యాయ వ్యవస్థ ప్రాథమిక బాధ్యత అని చెప్పారు.
కోర్ట్ ప్రొసీడింగ్లు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉండాలన్నారు. దీని వల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందన్నారు. చట్టాలకు, న్యాయానికి న్యాయ వ్యవస్థ వారధిలాగా పని చేయాలన్నారు. కోర్టు తీర్పులు సామాన్యులకు చాలా సందర్భాల్లో ఊరట కలిగిస్తాయని చెప్పారు.