న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించరాదని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కలన్నిటినీ సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల కాటు వల్ల రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా పిల్లలు దీనికి గురవుతుండడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 5,000 వీధి కుక్కల కోసం 6 నుంచి 8 వారాలలో షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమ ఆదేశాలకు అవరోధాలు కల్పించడానికి వ్యక్తులు కాని, సంస్థలు కాని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. అవసరమైతే కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని కూడా ధర్మాసనం హెచ్చరించింది. వీధి కుక్కలను పట్టుకోవడానికి వచ్చే సిబ్బందిని ఎవరైనా అడ్డుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఆ పిల్లల ప్రాణాలను తిరిగి తేగలరా?
రేబీస్ వ్యాధితో మరణించిన పిల్లల ప్రాణాలను జంతు ప్రేమికులమని చెప్పుకుంటున్న వారు తిరిగి తీసుకురాగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవలసిందేనని స్పష్టం చేసింది. దేశ రాజధానిలో వీధి కుక్కల కాట్ల వల్ల రేబీస్ సోకుతున్న ఘటనలు పెరుగుతుండడంపై జూలై 28న చేపట్టిన సుమోటో కేసుపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అన్ని వీధి కుక్కలను తొలగించి షెల్టర్లలో ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వంతోపాటు గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ మున్సిపల్ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తాము ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈవిషయంలో ఎటువంటి మనోభావాలు ఉండరాదని కూడా సూచించింది. రేబీస్‌కి దారితీసే కుక్క కాట్లకు శిశువులు, పిల్లలు బలికారాదని, ఈ చర్య వల్ల తాము స్వేచ్ఛగా రోడ్లపై తిరగవచ్చన్న విశ్వాసాన్ని పిల్లలు, వృద్ధులలో కలిగించవచ్చని ధర్మాసనం తెలిపింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పును జంతు ప్రేమికులు వ్యతిరేకించారు.