న్యూఢిల్లీ: ఓట్ల తొలగింపుపై తాము ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించిన భారత ఎన్నికల సంఘానికి(ఈసీ) సుప్రీంకోర్టు బుధవారం గట్టి కౌంటర్ ఇచ్చింది. బీహార్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను కారణాలు పేర్కొంటూ ఆగస్టు 19లోగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీని ఆదేశించింది.
ప్రతి ఓటరుకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ 65 లక్షల పేర్ల జాబితాను ముద్రించాలని కూడా ధర్మాసనం ఈసీని ఆదేశించింది. ఈసీ తప్పిదం వల్ల తమ పేర్లు ఓటర్ల జాబితాలో కోల్పోయిన వారు ఆధార్ కార్డుల కాపీని జతచేసి తమ క్లెయిమ్లు సమర్పించవచ్చని కూడా సుప్రీంకోర్టు సూచించింది.