న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ యూజీ 2026 పేపర్ లీక్(NEET UG 2026 paper Leak) కేసులో దాఖలైన పలు పిటీషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. జస్టిస్ పీఎస్ నర్సింహ, అలోక్ ఆరాదేతో కూడిన ధర్మాసనం నీట్ పేపర్ లీక్ కేసును పరిశీలించింది. గతం నుంచి ఎన్టీఏ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని సుప్రీం ధర్మాసనం నిరాశను వ్యక్తం చేసింది. 2024లోనూ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఏడాది సుప్రీం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది, కానీ ఎన్టీఏ మాత్రం ఆ మానిటరింగ్ కమిటీ చేసిన సూచనల గురించి స్పందించలేదని సుప్రీం తెలిపింది. పేపర్ లీక్ కేసులో దాఖలైన పిటీషన్లకు ఎన్టీఏ రెస్పాన్స్ ఇవ్వాలని సుప్రీం కోరింది. హై-పవర్ మానిటరింగ్ కమిటీ చేసిన ప్రతిపాదనల గురించి ఎన్టీఏ చైర్మెన్ కే రాధాకృష్ణన్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం తెలిపింది. మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. లీకేజీ అయినట్లు ఆరోపణలు రావడంతో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అయితే జూన్ 21వ తేదీన రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంలో పిటీషన్ వేసింది. ఎన్టీఏను పునర్ వ్యవస్థీకరించాలని ఆ పిటీషన్లో కోరింది. సుప్రీం రిటైర్డ్ జడ్జితో కలిపి ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిటీ నేతృత్వంలో నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ను నిర్వహించాలని ఎఫ్ఏఐఎంఏ డిమాండ్ చేసింది. ప్రశ్నాపత్రాలను డిజిటల్ లాకింగ్ చేయాలని పిటీషన్లో కోరారు. లోపాలను గుర్తించేందుకు సెంటర్ వైజ్ ఫలితాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ మరో పిటీషన్ దాఖలు చేసింది. ఎన్టీఏ సంఘాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని కోరారు. పార్లమెంట్ చట్టం ద్వార ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ బాడీని ఏర్పాటు చేయాలని ఓ పిల్లో కోరారు. పేపర్ లీకేజీ ఘటనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,1 5 ఉల్లంఘించినట్లు అవుతుందని పిటీషన్లో తెలిపారు. కే రాధాకృష్ణన్ కమిటీ చేసిన ప్రతిపాదిన సంస్కరణలను అమలు చేయలేదని పిటీషన్లో పేర్కొన్నారు.