Supreme Court : భారత ఎన్నికల సంఘాని (Election Commission of India) కి సుప్రీంకోర్టు (Supreme Cout) నోటీస్ జారీచేసింది. పని భారంతో ప్రాణాలు తీసుకుంటున్న బూత్ లెవల్ అధికారుల (Booth level officers) ను రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆ పిటిషన్పై స్పందన తెలియజేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది. ఈ స్పెషల్ డ్రైవ్ బూత్ లెవల్ అధికారులకు పని భారం పెంచింది. దాంతో పని భారం భరించలేక పలువురు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బూత్ లెవల్ అధికారులను రక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పందనను కోరింది.
ఇదిలావుంటే ఎన్నికల సంఘం హడావిడిగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతుండటాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అధికార బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఎన్నికల సంఘం చర్యలు ఉన్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రెండుమూడేళ్ల సమయం తీసుకుని ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు.
బీహార్లో కూడా తీరా ఎన్నికల ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఈసీ లక్షల ఓట్లను తొలగించి బీజేపీకి లబ్ధి చూకూర్చిందని మమత గతంలో ఆరోపించారు. అయితే బెంగాల్లో ఈసీ పప్పులు ఉడకనివ్వబోమని హెచ్చరించారు. అయినా ఈసీ సమగ్ర సవరణ కొనసాగిస్తుండటంతో అందుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈ నిరసనలు హింసకు దారితీశాయి.