న్యూఢిల్లీ: కేవలం పెండ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. బంధాలు విచ్ఛిన్నమవడం మానసిక వేదనకు గురి చేసేదే అయినప్పటికీ, నేరుగా అది ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించదని వ్యాఖ్యానించింది. 2007లో ఓ యువతి(21) ఆత్మహత్య కేసులో పెండ్లి పేరుతో మోసం చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కారణంతో కమరుద్దిన్ దస్తగిర్ సనాది అనే వ్యక్తికి కర్ణాటక హైకోర్టు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది.
ఈ తీర్పును అతడు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, శుక్రవారం జస్టిస్ పంకజ్ మితల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారించింది. ‘నిందితుడు కేవలం పెండ్లికి నిరాకరించాడు. ఇది బంధం విచ్ఛిన్నం కావడం మాత్రమే. మృతురాలిని అతడు ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. నిందితుడిని పెండ్లికి ఒప్పించాలని, ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో మృతురాలు ముందుగానే విషం తీసుకెళ్లింది.
కాబట్టి, కేవలం పెండ్లికి నిరాకరించాడనే కారణంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడని దోషిగా తేల్చలేం.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అతడు పెండ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినట్టు ఆధారాలు లేవని, ఒకవేళ ఆ వాగ్దానం చేసినా దానికి సెక్షన్ 306(ఆత్మహత్యకు ప్రేరేపించడం) వర్తించదని, ఇతర చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టేసింది.