Supreme Court | సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై మధ్యంతర తీర్పు ఇవ్వనున్నది. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో సోమవారం ఈ అంశంపై ఉదయం 10.30 గంటలకు మధ్యంతర తీర్పు ఇవ్వనున్నది. మూడు అంశాలపై టాప్కోర్టు తీర్పును ఇవ్వనున్నది. ఇందులో ఒకటి కోర్టులు వక్ఫ్ జాబితా నుంచి వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయచ్చా?.. రెండో అంశంపై రాష్ట్రాల్లోని, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించడం.. మూడోది వక్ఫ్ ఆస్తులపై కలెక్టర్ ద్వారా విచారణ చేసి అవునా? కదా? అని నిర్ణయించడంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనున్నది. ఈ మే 22న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మూడు అంశాలపై ఇరుపక్షాల వాదనలు విన్నది. ఆ తర్వాత మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు వెబ్సైట్ కేసుల జాబితా ప్రకారం.. సోమవారం ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పును వెలువరించనున్నది.
తీర్పును రిజర్వ్ చేసే ముందు ధర్మాసనం వరుసగా మూడురోజుల పాటు విచారించింది. సవరించిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. పిటిషనర్లు స్టే కోరిన ఈ మూడు ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్నది. డీనోటిఫికేషన్ సమస్యతో పాటు, పిటిషనర్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ నిర్మాణాన్ని కూడా ప్రశ్నించారు. ఈ సంస్థలను ముస్లింలు మాత్రమే నిర్వహించాలని చెప్పారు. మూడవ అంశం జిల్లా కలెక్టర్ ఒక ఆస్తి ప్రభుత్వ భూమి అవునా కాదా? అని విచారించడాన్ని సైతం పిటిషనర్లు తప్పుపట్టారు. ప్రభుత్వానికి అనుకూలంగానే కలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని కోర్టుకు తెలిపారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని గట్టిగా సమర్థించింది. వక్ఫ్ అనేది ‘లౌకిక’ వ్యవస్థ అని ప్రభుత్వం చెబుతోంది. దాంతో చట్టం అమలును ఆపలేమని.. ఎందుకంటే పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా పరిగణిస్తారని.. వక్ఫ్ ఇస్లామిక్ భావన అయినప్పటికీ, అది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ చట్టం చారిత్రక చట్టాలు, రాజ్యాంగ సూత్రాలకు పూర్తిగా భిన్నమైందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తిని చట్టవిరుద్ధంగా నియంత్రించడమే దీని ఉద్దేశమన్నారు.
ఏప్రిల్ 25న, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ను సమర్థిస్తూ సుప్రీంకోర్టులో 1,332 పేజీల ప్రాథమిక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ చట్టం పార్లమెంట్ ఆమోదించినందున.. రాజ్యాంగబద్ధంగా పరిగణించాలి కాబట్టి.. ఈ చట్టంపై ఎలాంటి ‘సామూహిక నిషేధం’ విధించవద్దని కోర్టును అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 8న వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ను నోటిఫై చేసింది. అంతకుముందు ఏప్రిల్ 5న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్టాన్ని ఆమోదించారు. లోక్‌సభ, రాజ్యసభ వరుసగా ఏప్రిల్ 3, 4 తేదీల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ఆమోదించిన విషయం తెలిసిందే.