న్యూఢిల్లీ, జూన్ 12: నీట్ పరీక్షలో 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలఖ్ పాండే బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పరీక్ష నిర్వహణపై ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఏ పాలసీ ప్రకారం గ్రేస్ మార్కులు ఇచ్చారో ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు సెలవు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
నీట్ యూజీ-2024లో అక్రమాలు జరి గాయన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నది. ఈ మేరకు ఓ పిటిషన్ వేస్తామని ఎన్టీఏ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. మరోవైపు పలువురు నీట్ విద్యార్థులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై సమాధానం చెప్పాలని జస్టిస్ నీనా బన్సాల్ క్రిష్ణ వెకేషన్ బెంచ్ ఎన్టీఏకు నోటీసులిచ్చింది. అయితే కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది.