న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నష్ట పరిహారం చెల్లింపు వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంటుందని, ఇది రాష్ర్టాల రాజ్యాంగ, చట్టబద్ధమైన బాధ్యత అని గుర్తు చేసింది. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన తీర్పును వెలువరించింది.
హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కంపెనీ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ కోసం ప్రభుత్వం 54 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో పరిహారం చెల్లింపు పూర్తి చేయకుండా రాష్ట్ర సర్కార్ సిమెంట్ కంపెనీకి భూమిని స్వాధీనం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి బాధితులకు 9 శాతం వడ్డీతో కలుపుకొని అసలును చెల్లించాలని, అటు తర్వాత ఆ మొత్తాన్ని సదరు సిమెంట్ కంపెనీ నుంచి వసూలు చేసుకోవాలని హిమాచల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.