న్యూఢిల్లీ, నవంబర్ 1: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పథకం వివరాలు కొందరికే అందుబాటులో ఉండటంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దాతలు అందించే విరాళాల వివరాలు సాధారణ ప్రజలకు అందుబాటులో లేవని, అయితే ఎస్బీఐ (బాండ్లు జారీ చేసే అధీకృత బ్యాంకు), దర్యాప్తు సంస్థలు మాత్రం ఈ వివరాలు పొందే వీలుందని పేర్కొన్నది. రాజకీయ పార్టీలకు డబ్బులు అందించడం ద్వారా ఇది ముడుపులకు చట్టబద్ధత కల్పిస్తున్నదని వ్యాఖ్యానించింది. ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావించినట్టయితే.. విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని, వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచిపెడుతుందని పేర్కొన్నది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ పథకం ప్రభుత్వం, దాతల మధ్య క్విడ్ ప్రో కోకు అవకాశం కల్పిస్తున్నదని పేర్కొన్నది.