న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయనే అభియోగాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. వచ్చే నవంబర్ 20 వరకు కవితను ఈడీ విచారణకు పిలవరాదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. గత విచారణ సమయంలో జారీచేసిన ఉత్తర్వులను మంగళవారం జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం పొడిగించింది.
గత మార్చి 27న కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను, నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులకు జతచేసింది. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ దరి వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ ప్రకారం, హవాలా చట్టంలోని 50వ నిబంధన ప్రకారం మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీలకు వెసులుబాటు కల్పిస్తూ వెలువరించిన ఉత్తర్వులను పిటిషనర్‌కు కూడా జారీ చేయాలని కోరారు.
నళిని చిదంబరం కేసులో ఆమె విచారణకు రావాలని ఈడీ పట్టుబట్టలేదని, కవితకు కూడా వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. కస్టమ్స్యాక్ట్, సీఆర్పీసీ సెక్షన్ 160, ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ ఏ)ల్లోని నిబంధనలు మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయని తెలిపారు. బెయిల్ సెక్షన్, సెక్షన్ 45లు కూడా మహిళలకు కొన్ని సడలింపులు ఇచ్చాయని చెప్పారు. ఏదైనా కేసులో సాక్షిగా లేదా ఏ స్థాయిలోనైనా విచారణకు మహిళలను పిలవకూడదన్నారు. ఢిల్లీ లికర్ వ్యవహారంలో తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన సమన్ల అమలును నిలిపివేయాలని కోరారు.
అన్ని కేసులు ఒకే కోవలో పరిగణించలేం
వాదనలపై స్పందించిన ధర్మాసనం.. అన్ని కేసులను ఒకే విధమైనవిగా పరిగణించలేమని పేర్కొంది. ఒక్కో కేసులో వేర్వేరు ఇతర అంశాలు ఉంటాయని గుర్తుచేసింది. పీఎంఎల్‌ఏపై నమోదైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 11 నుంచి 18 వరకు విచారణ జరుపుతుందని వెల్లడించింది. ప్రస్తుతం కవిత పిటిషన్ సైతం పీఎంఎల్ ఏతో ముడిపడి ఉన్నందున రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పుకు అనుగుణంగా విచారణ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటివరకు ఈడీ అధికారులు కవితను విచారణకు పిలవరాదని తేల్చి చెప్పింది.