న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓ వ్యక్తి పేరును చేర్చడానికి లేదా తొలగించడానికి ఆ వ్యక్తి గుర్తింపును నిర్ధారించే పత్రాల్లో ఒకదానిగా ఆధార్ కార్డును పరిగణించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు తెలిపింది. బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. ఓటరు రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్స్‌లో 12వ పత్రంగా ఆధార్‌ను పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పింది.
ఓటర్ల గుర్తింపును రుజువు చేయడానికి వివిధ పత్రాలను ఉపయోగించడానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 అవకాశం కల్పించింది. దీనికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఈ వివరణ ఇచ్చింది. అయితే, ఆధార్‌ను కేవలం వ్యక్తి గుర్తింపును రుజువు చేయడానికి మాత్రమే ఉపయోగించాలని, భారత దేశ పౌరసత్వానికి రుజువుగా దానిని ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ఏదైనా ఆధార్ కార్డు అసలుదా? నకిలీదా? నిర్ధారించడం కోసం అధికారులు తనిఖీ చేయవచ్చునని పేర్కొంది. ఈ తీర్పును అమలు చేయాలని ఎలక్టొరల్ ఆఫీసర్లకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.