Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినంగా
ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ
పార్దివాలా ధర్మాసనం పిటిషన్‌ను విచారించేందుకు తిరస్కరించింది. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో కష్టపడ్డారని, ఆయన సేవలను స్మరించుకునేందుకు ఇదో ఉత్తమ మార్గమని న్యాయవాది పేర్కొనగా.. సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మీరు పిల్ అధికార పరిధిని అపహాస్యం చేస్తున్నారు. కనీసం కోర్టు ఏం చేయగలదో ఆలోచించండి. ఇటీవలి కాలంలో ఇలాంటి పిటిషన్ల పరంపరను నేను చూస్తున్నాను. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది. కోర్టు అధికార పరిధిని సీరియస్‌గా తీసుకోండి. మీరు కూడా న్యాయవాది’ అని సీజేఐ పేర్కొన్నారు. అయితే, సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23న జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది కేకే రమేశ్ సుప్రీంకోర్టులో ఈ పిల్‌ను దాఖలు చేశారు.