న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ సోమవారం కొట్టివేసింది. లక్షలాది వాహనదారులను వారి వాహనాలకు అనుగుణంగా లేని ఇంధనాన్ని వాడాలని ఒత్తిడి చేస్తున్నారని పిటిషనర్ అయిన న్యాయవాది అక్షయ్ మల్హోత్రా వాదించారు. అన్ని ఇంధన స్టేషన్లలో ఇథనాల్ రహిత పెట్రోల్ అందుబాటులో ఉండేలా పెట్రోలియం శాఖ చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
2023 కు ముందు తయారైన కార్లు, ద్వి చక్ర వాహనాలు, కొన్ని బీఎస్-4 మోడల్ వాహనాలు ఇంత ఎక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనానికి అనుకూలమైనవి కావని వాదించారు. ఈ పిటిషన్‌పై అటార్నీ జనరల్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ ఈబీపీ-20 ఇంధనం చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్తూ.. పిటిషన్‌ను వ్యతిరేకించారు. పిటిషనర్ వెనుక లాబీయింగ్ గ్రూప్ ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని పరిగణనలోనికి తీసుకుందన్నారు. ఈ వాదనల అనంతరం ధర్మాసనం పిల్‌ను కొట్టేసింది.