న్యూఢిల్లీ, మే 13: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పథకం కింద బాధితులకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేస్తారు. ఈ పథకం అమలు తీరు, దీని కింద ఎంతమంది లబ్ధిదారులకు చికిత్స అందించారు తదితర వివరాలతో ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు లోగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఈ పథకం నిజమైన స్ఫూర్తితో అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వాన్ని తాము నిర్దేశిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ఈ పథకం మే 5 నుంచి అమలులోకి వచ్చిందని, గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్టు కేంద్రం వివరించింది. నగదు రహిత పథకం జాప్యంపై ఏప్రిల్ 28న కేంద్రాన్ని సుప్రీం మందలించింది.