Delhi riots case: 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం తీర్పు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు ఆందోళనకరంగా మారి, అల్లర్లకు దారి తీశాయి. ఈ ఘటనల్లో 53 మంది మరణించగా, 700 మందికిపైగా గాయపడ్డారు.
దీంతో పోలీసులు కేసు ఫైల్ చేసి, ఉమర్ ఖలీద్, షర్జీల్ వంటి విద్యార్థి నేతలతోపాటు పలువురిపై ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా నేరాలకు పాల్పడ్డట్లు వీరిపై బలమైన ఆధారాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి షర్జీల్ పోలీసులకు లొంగిపోగా, ఖలీద్ ను 2020 సెప్టెంబర్ లో అరెస్ట్ చేశారు. నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. గతంలో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఏడుగురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా జస్టిస్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెల్లడించింది.
ఉమర్, షర్జీల్ కు బెయిల్ నిరాకరించింది. మరో ఐదుగురు నిందితులు.. గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ కు బెయిల్ మంజూరు చేసింది. ఉమర్, షర్జీల్ లు నేరానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నందున వారికి బెయిల్ నిరాకరిస్తున్నట్లు తెలిపింది. మిగతా నిందితులతో పోలిస్తే వీరిపై ఉన్న అభియోగాలు వేరని కోర్టు అభిప్రాయపడింది.