Supreme Court | మతమార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆమోదించిన మత మార్పిడి నిరోధక బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. ఆయా బిల్లులపై పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయా పిటిషన్లను డిసెంబర్లో విచారణకు జాబితా చేయనున్నట్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది.. చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వచ్చేవారానికి జాబితా చేయాలని కోరారు. దాంతో సీజేఐ స్పందిస్తూ ‘అది సాధ్యం కాదు. నేను తీర్పులు రాయాలి. నవంబర్ 23న పదవీ విరమణ చేస్తున్నాను’ అని సీజేఐ పేర్కొన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో మతమార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు పలు రాష్ట్రాలను వైఖరి ఏంటో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు రాయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. అలాంటి చట్టాల అమలును నిలిపివేయాలని చేసిన అభ్యర్థనను సమాధానాలను.. సమాధానం విన్న తర్వాత పరిశీలిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తర్వాత రాష్ట్రాలకు స్పందన చెప్పేందుకు నాలుగువారాల సమయం ఇచ్చింది. పిటిషనర్లు రెండు వారాల తర్వాత రీజాయిండర్లు దాఖలు చేయడానికి అనుమతించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటకతో పలు రాష్ట్రాలు అమలులోకి తీసుకువచ్చిన మతమార్పిడి నిరోధక చట్టాల రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది.