Supreme Court : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఓట్ల లెక్కింపు వేళ టీఎంసీ అధినేత్రి (TMC Chief), సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కి సుప్రీంకోర్టు (Supreme Court) లో చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నుంచి మాత్రమే ఎంపిక చేసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 13 నాటి ఈసీ సర్క్యులర్ తప్పని చెప్పలేమని స్పష్టంచేసింది.
ఓట్ల లెక్కింపు కోసం కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ తొలుత కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. అయితే, ఈసీ నిర్ణయంలో ఎలాంటి అక్రమం లేదని హైకోర్టు పేర్కొన్నది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మిశ్రమంగా కౌంటింగ్ సిబ్బంది ఉంటారని తమ సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు ఈసీ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.
రిటర్నింగ్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉంటారని, కౌంటింగ్ సిబ్బందిని నియమించే అధికారం ఆయనకు ఉంటుందని తెలిపింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయన్న టీఎంసీ ఆందోళనలు నిరాధారమని వాదించింది. ఆ సర్క్యులర్‌ను తూచా తప్పకుండా అమలుచేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. టీఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ఆ సర్క్యులర్ ఏప్రిల్ 13 నాటిదని.. అయితే, దాని గురించి తమకు ఏప్రిల్ 29న తెలిసిందని అన్నారు. ఆ సర్క్యులర్‌లో ఉన్నదిఉన్నట్లుగా అమలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
దాంతో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ స్పందిస్తూ.. ఆ సర్క్యులర్ అమలు కావాలని ఆశిస్తున్నట్లయితే అసలు కోర్టు ముందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. టీఎంసీ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. దీనిపై తదుపరి ఆదేశాలు అక్కర్లేదని చెప్పారు.