Supreme Court | న్యూఢిల్లీ : కొందరు వివాహితలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భర్తలను, వారి బంధువులను వేధించేందుకు ఐపీసీ సెక్షన్ 498ఏను దుర్వినియోగం చేయడం పెరుగుతుండటం పట్ల సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరులో ఐటీ ప్రొఫెషనల్ అతుల్ సుభాశ్ తన భార్య వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడటంపై ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. దార లక్ష్మీనారాయణ, తదితరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, మరొకరు కేసు విచారణ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వివాహితలపై వారి భర్తలు, అతని తరపు బంధువులు క్రూరత్వానికి పాల్పడితే, వారిని శిక్షించాలని ఈ సెక్షన్ చెప్తున్నదని, కానీ ఈ సెక్షన్ దుర్వినియోగమవుతున్నదని వ్యాఖ్యానించింది. మహిళలను గృహ హింస, వేధింపుల నుంచి కాపాడటం ఈ సెక్షన్ అసలు ఉద్దేశమని, అయితే, కొందరు మహిళలు తమ అసమంజసమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా తమ భర్తలు, వారి కుటుంబ సభ్యులను నిర్బంధించేందుకు వాడుకుంటున్నారని పేర్కొంది.
భర్త, అతని తరపు బంధువులపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం ఓ సాధనంగా సెక్షన్ 498ఏను వాడుకునే ధోరణి పెరుగుతున్నదని పేర్కొంది. ఇండ్లలో జరిగే ఘర్షణలపై వివాహితలు అస్పష్టమైన, సాధారణ ఆరోపణలు చేస్తున్నారని, వీటిని సరిచూడకపోతే, న్యాయ ప్రక్రియల దుర్వినియోగానికి దారి తీస్తుందని హెచ్చరించింది. భార్య లేదా ఆమె తరపు బంధువులు భర్త చేతిని మెలిపెట్టి, వసూళ్లకు పాల్పడటాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపింది. భర్త, అతని తరపు బంధువులపై భార్య దాఖలు చేసిన క్రూరత్వం, వరకట్నం కేసులను డిస్మిస్ చేసింది. ఈ కేసులను డిస్మిస్ చేయడానికి తెలంగాణ హైకోర్టు తిరస్కరించడంతో భర్త, అతని తరపు బంధువులు సుప్రీంకోర్టులో అపీలు చేశారు. ఈ కేసులో భర్త తన భార్య నుంచి విడాకులు కోరారు. వెంటనే ఆమె ఈ కేసులను దాఖలు చేశారు. వీటిపై వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆమె సమర్థనీయం కానటువంటి వ్యక్తిగత స్వార్థం కోసం ఈ కేసులను దాఖలు చేసినట్లు గుర్తించింది. ఆమె తనను కాపాడటం కోసం ఉద్దేశించిన చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నట్లు గమనించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాశ్ (34) బెంగళూరులో ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఆయన సోమవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన 24 పేజీల సూసైడ్ నోట్‌ను వాట్సాప్ గ్రూప్‌లో, ఈ-మెయిల్ ద్వారా అనేక మందికి షేర్ చేశారు. తన భార్య, ఆమె తరపు బంధువులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన, ఆయన బంధువులు క్రూరత్వానికి, వేధింపులకు పాల్పడినట్లు ఆయన భార్య ఉత్తరప్రదేశ్‌లో కేసులు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీటి గురించి ఆయన ఓ వీడియోలో కూడా వివరించారు. మన దేశంలో ప్రస్తుతం పురుషులపై చట్టబద్ధ మారణకాండ జరుగుతున్నదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ కుటుంబ న్యాయస్థానం మహిళా జడ్జి లంచాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతుల్ సుభాశ్‌కు న్యాయం జరగాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతున్నది.