న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బుధవారం వీధి కుక్కల బెడదపై విచారణ సందర్భంగా కోళ్లు, మేకలవి ప్రాణాలు కాదా? అని ప్రశ్నించింది. ఓ పిటిషనర్ ఓ ఫొటోను చూపిస్తూ, వీధి కుక్కల దాడిలో 90 ఏండ్ల వ్యక్తి గాయపడి, మరణించినట్లు తెలిపారు. బాధితుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వీధి కుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మానవ హక్కులను కాపాడాలని కోరారు. జపాన్, అమెరికాలో వీదుల్లో వదిలేసిన కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తారని చెప్పారు. వాటిని ఇతరులు దత్తత తీసుకోకపోతే, సున్నితంగా చంపుతారని తెలిపారు.
అందుకే జపాన్‌లో వీధి కుక్కల సమస్య లేదని, 1950 తర్వాత రేబిస్ వ్యాధి సంబంధిత మరణాలు లేవన్నారు. మరో న్యాయవాది మాట్లాడుతూ, ‘నో డాగ్ జోన్స్’గా ప్రకటించేందుకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. మరోవైపు వీధి కుక్కలను పరిరక్షించాలని కోరుతున్న పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, తాము పర్యావరణం, శునకాల ప్రేమికులుగా వచ్చామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుని, “మిగిలిన జంతువుల ప్రాణాల సంగతి ఏమిటి? కోళ్లు, మేకల సంగతి ఏమిటి? వాటివి ప్రాణాలు కాదా?” అని ప్రశ్నించింది.
తాను దేవాలయాలు, ఇతర చోట్లకు వెళ్లినపుడు తనను కుక్కలు కరువలేదని సిబల్ చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, “మీరు అదృష్టవంతులు. జనాన్ని, పిల్లల్ని కరుస్తున్నాయి. జనం చనిపోతున్నారు’ అని తెలిపింది. సిబల్ మాట్లాడుతూ, కుక్క ఎవరినైనా కరిస్తే, ఓ సెంటర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చునని తెలిపారు. ఆ కుక్కను ఆ సెంటర్‌కు తీసుకెళ్లి, స్టెరిలైజ్ చేయించి, తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టవచ్చునని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రతిస్పందిస్తూ, ఇక మిగిలింది విడుదలైన కుక్కకు కౌన్సిలింగ్ ఇవ్వడమేనని వ్యాఖ్యానించింది.
కుక్క కరువాలనుకుంటున్నదా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు దాని మనసును ఎవరూ చదవలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరిచిన తర్వాత చికిత్స చేసి, నయం చేయడం కన్నా నిరోధించడమే శ్రేయస్కరమని తెలిపింది. రోడ్లపై కుక్కలు ఉండకూడదని పేర్కొంది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.