న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : మహిళ దుస్తులను లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచార యత్నం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ చర్యలు అత్యాచార యత్నం నేరంగా పరిగణించడానికి సరిపోవంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఇంటి వద్ద దిగబెడుతామన్న సాకుతో ముగ్గురు యువకులు 14 ఏండ్ల తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆమె ప్రైవేట్ భాగాలను తాకేందుకు ప్రయత్నించారని, ఆమె పైజామా బొందును తెంచారంటూ యూపీలోని కాస్గంజ్ జిల్లాకు చెందిన ఒక మహిళ 2022లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు 2025, మార్చి 17న తీర్పు చెబుతూ యువకుల ఈ చర్యలు అత్యాచార యత్నంగా పరిగణించ లేమని పేర్కొంటూ.. అత్యాచార యత్నం ఆరోపణలను కేసు నుంచి ఉపసంహరించాలని ఆదేశించింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారించిన సుప్రీం కోర్టు ఆ న్యాయస్థానం ఆదేశాలపై స్టే విధించింది. హైకోర్టు తీర్పు మొద్దుబారిన, అమానవీయ విధానంగా ఉందని వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు.. తీర్పు సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు బాధితురాలిని భయపెట్టే విధంగా ఉన్నాయని పేర్కొన్నది. ఈ విషయంలో హైకోర్టులు, కింది కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు తెలిపింది.