న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ‘బిడ్డను మేము చంపలేము’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ 26 వారాల గర్భ విచ్ఛిత్తికి తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గురువారం విచారించింది. మహిళ గర్భంలోని పిండం హక్కులను, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే మహిళ హక్కులను తాము బేరీజు వేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొంటూ మరికొన్ని రోజులు తన గర్భాన్ని ఉంచుకునే అవకాశంపై ఆ మహిళతో మాట్లాడాలని ఆమె తరఫు న్యాయవాదిని కోరింది. ‘పిండం గుండె చప్పుడు ఆపేయాలని ఎయిమ్స్ డాక్టర్లకు కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేయాలని మీరు కోరుకుంటున్నారా’ అని ఆయనను ప్రశ్నించగా దానికి ‘లేదు’ అని సమాధానం చెప్పారు. ఈ మహిళ 24 వారాలకు పైగా తన గర్భంలో శిశువును మోస్తున్నదని, మరో కొన్ని వారాలు ఆగితే పండంటి బిడ్డను కనే అవకాశం ఉంది కదా? అప్పుడు ఏం చేయాలన్నది ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొంది. ఒక వేళ తొందరపాటు ప్రసవానికి పాల్పడితే తర్వాత వైకల్యంతో బిడ్డ జన్మిస్తే దత్తత తీసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రారని పేర్కొంటూ కేసు తదుపరి విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసింది.
కేసు వివరాల్లోకి వెళితే.. గర్భ విచ్ఛిత్తికి అనుమతి కోరుతూ ఒక మహిళ చేసిన విజ్ఞప్తిపై వచ్చిన ఆదేశం మేరకు ఎయిమ్స్‌కు చెందిన మెడికల్ బోర్డు పరిశీలించి అక్టోబర్ 6న ఇచ్చిన నివేదిక మేరకు సుప్రీం కోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. అయితే గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ల బృందంలోని కొందరు పేర్కొనడంతో కేసును ఇద్దరు మహిళా జడ్జీల ధర్మాసనానికి పంపారు. అయితే వారు ఈ కేసులో భిన్న తీర్పులు వెలువరించారు. తిరిగి కేసును సీజేఐ ధర్మాసనానికి పంపారు. దీంతో ఆయన నేతృత్వంలోని బెంచి గురువారం కేసు విచారించింది.