Supreme Court : దేశ రాజధాని ఏరియా (National capital Area) లో ఇటీవల అదృశ్యమైన ఆరుగురు పిల్లలను రక్షించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ సందర్భంగా పిల్లల అక్రమ రవాణా (Child trafficking ) పై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని చట్టం ముందు నిలబెట్టాలని, అలాంటి ముఠాలు ఈ సమాజానికి ఎంతో ప్రమాదకరమని హెచ్చరించింది.
నవజాత శిశువులను లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు వచ్చిన వార్తలపై జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మాధవన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. ‘ఆ ఆరుగురు చిన్నారుల ఆచూకీని గుర్తించండి. పిల్లలను అమ్ముతున్న, కొంటున్న వారిని చట్టం ముందు నిలబెట్టండి. వారందరూ నిందితులే. వారంతా సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించారు’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పిల్లల అక్రమంగా రవాణా చేసేవాళ్లు హంతకులకంటే ప్రమాదకరమని జస్టిస్ పార్థివాలా అన్నారు. ‘ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే దాని వెనుక పలు కారణాలు, ఉద్దేశాలు ఉంటాయి. ఆ తర్వాత అతడు మరో హత్య చేయకపోవచ్చు. కానీ పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేవారు ఆ నేరాలకు మళ్లీమళ్లీ పాల్పడుతున్నారు. వారు ఈ సమాజానికి హంతకుల కంటే ప్రమాదకరమైనవారు’ అని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది.
ఢిల్లీలో పిల్లల అక్రమ రవాణా రాకెట్ వెనుకున్న కీలక సూత్రధారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారని, దీని వెనుక ఒక పెద్ద ముఠా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా పోలీసులు.. కొందరు పిల్లలను ఎవరూ కిడ్నాప్ చేయడం లేదని, తల్లిదండ్రులే విక్రయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దాంతో పిల్లలు దొరికినా ఎవరైనా తల్లిదండ్రులు వారిని తిరిగి తీసుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేకపోతే.. ప్రభుత్వమే వారి బాధ్యత తీసుకోవాలని కోర్టు సూచించింది. ప్రతి ఏడాది దాదాపుగా రెండు వేల మంది పిల్లల అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.