న్యూఢిల్లీ : భార్యను వరకట్నం కోసం వేధించి హత్య చేశారన్న అభియోగాల కేసులో ఓ బ్లాక్ కాట్ కమాండో విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. తాను ఆపరేషన్ సిందూర్‌లో సేవలందించిన విషయాన్ని, 20 ఏండ్లు రాష్ట్రీయ రైఫిల్స్‌లో పని చేసిన విషయాన్ని పరిగణనలోనికి తీసుకొని మినహాయింపు ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తోసి పుచ్చింది. ఈ కారణంతో కేసును రక్షణ కల్పించలేమని స్పష్టంచేసింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
పెండ్లయిన రెండేండ్లకే భార్యను వరకట్నం కోసం వేధించి హత్య చేశారని 2004లో బల్జీందర్ సింగ్‌పై అమృత్సర్ కోర్టులో కేసు నమోదైంది. మూడేండ్లు జైల్లో ఉన్న తర్వాత అతడి అప్పీల్ పంజాబ్-హర్యానా హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఇన్నాళ్లు అతడు జైలు బయట ఉన్నాడు. ఈ ఏడాది మేలో హైకోర్ట్ అతడి అప్పీల్‌ను కొట్టేసి అతడికి పదేండ్ల కఠిన జైలు శిక్షను సమర్థించింది. నిందితుడికి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.