న్యూఢిల్లీ: సుమారు 2700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆమ్టెక్ గ్రూపు మాజీ చైర్మెన్ అరవింద్ ధామ్ .. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10 గంటల వరకు జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆంజియోగ్రఫీ పరీక్ష కోసం అదనపు సమయం ఇవ్వాలని, లేదంటే బెయిల్ మంజూరీ చేయాలని ధామ్ అభ్యర్థన పెట్టుకున్నారు.
దీని పట్ల సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు ఆంజియోగ్రాఫీ పరీక్ష చేసుకుంటారని, ఇది సరైంది కాదు అని, ముందు మీరు సరెండర్ కావాలని, కస్టడీలో ఉండి కూడా టెస్టు చేసుకోవచ్చు అని సీజేఐ తెలిపారు. ఒకవేళ ఆంజియోగ్రాఫీ పరీక్ష తర్వాత సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తే అప్పుడు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ల వచ్చు అని ధర్మాసనం తెలిపింది. అరవింద్ ధామ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.