న్యూఢిల్లీ: కేంద్రం, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు ఆర్టీఐ కమిషనర్లను నియమించడంలో తీవ్ర జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ‘వీటిని త్వరగా భర్తీ చేయకపోతే ఈ సంస్థలు ఉండి ఏం ప్రయోజనం? కేవలం బ్యూరోక్రాట్లనే కమిషనర్లుగా నియమిస్తున్నారు. ఇతర రంగాల నిపుణులను ఎందుకు నియమించరు? మేం దీని గురించి మరింత మాట్లాడదలచుకోలేదు’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
పిటిషనర్ అంజలీ భరద్వాజ్ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ సమాచార కమిషన్లలో ఖాళీల భర్తీపై 2019లోనే సుప్రీంకోర్టు సమగ్ర ఆదేశాలిచ్చినా అవి అమలు కావడం లేదన్నారు. కోర్టు స్పందిస్తూ రెండు వారాల్లోగా కమిషనర్ల ఎంపిక కోసం జాబితా సిద్ధం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కమిషనర్లు లేక తెలంగాణ, త్రిపుర, జార్ఖండ్ సమాచార కమిషన్లు నిరుపయోగంగా మారాయని ధర్మాసనం మండిపడింది.