న్యూఢిల్లీ, ఆగస్టు 14 : ఖనిజాలు, ఖనిజ నిల్వలు ఉన్న భూములపై 2005 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం వసూలు చేసిన పన్నులు, రాయల్టీని వాపస్ చెల్లించమని రాష్ర్టాలు అడగొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 12 ఏండ్ల పాటు విడతలవారీగా ఈ పన్ను బకాయిలను కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తిరిగి పొందొచ్చని రాష్ర్టాలకు అనుమతిచ్చింది. ఖనిజాలు, ఖనిజ వనరులు ఉన్న భూములపై రాయల్టీ, పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ర్టాలకు ఉందని జూలై 25న రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని 1989లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకుపెట్టింది. దీంతో తమ రాష్ర్టాల్లోని ఖనిజ వనరులపై 1989 నుంచి కేంద్రం తీసుకున్న రాయల్టీ, పన్నులను తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా పలు రాష్ర్టాలు సుప్రీంకోర్టును కోరాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు ఇచ్చిన జూలై 25 నుంచే అమలులోకి వచ్చేలా చూడాలని కోర్టును కోరింది.
గనులు, ఖనిజాలపై 1989 నుంచి వసూలైన రాయల్టీని తిరిగి రాష్ర్టాలకు చెల్లించాలనే వాదనను కేంద్రం వ్యతిరేకించింది. ఇలా చేస్తే ప్రజలు, ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్యూ)పై తీవ్ర ప్రభావం పడుతుందని వాదించింది. ప్రాథమిక అంచనాల ప్రకారమే పీఎస్యూలు రూ.70 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, దీంతో పీఎస్యూల ఖజానా ఖాళీ అవుతుందని పేర్కొన్నది. దీంతో బుధవారం రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయమై స్పష్టత ఇచ్చింది. 2005 ఏప్రిల్ 1 నుంచి గనులు, ఖనిజ వనరులపై కేంద్రం తీసుకున్న పన్నులను రాష్ర్టాలు తిరిగి పొందవచ్చని పేర్కొన్నది. కాగా, తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుపై తనతో సహా ఎనిమిది మంది న్యాయమూర్తులు సంతకం చేస్తారని, జూలై 25న భిన్నమైన తీర్పు ఇచ్చిన జస్టిస్ నాగరత్న మాత్రం సంతకం చేయరని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గనులు, ఖనిజ వనరులు ఉన్న రాష్ర్టాలకు భారీ మేలు జరగనుంది. ఇప్పటినుంచి వీటిపై పన్ను విధించే అధికారం రాష్ర్టాలకు రానుండటంతో పాటు గత 19 ఏండ్లుగా కేంద్రం వసూలు చేసిన పన్నులను కూడా తిరిగి పొందే అవకాశం రావడంతో భారీగా నిధులు అందనున్నాయి.