 
                                                            న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : ప్రపంచంపై అణు భయాలు ముసురుకుంటున్నాయి. అణ్వస్ర్తాల పాటవ పరీక్షలో అగ్రరాజ్యాలు పోటీపడుతుండడం ఇతర ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అణు ఇంధనంతో నడిచే క్రూయిజ్ క్షిపణి బురెవెస్త్నిక్ని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా గత ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అణ్వస్ర్తాలపై గడచిన 33 ఏండ్లుగా పాటిస్తున్న విధానాన్ని మార్చుకుంటున్నట్లు వెల్లడించారు. తక్షణమే అమెరికా అణ్వస్త్ర పరీక్షలు పునరుద్ధరించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. 1992 నుంచి అమెరికా స్వచ్ఛందంగా అమలుచేస్తున్న అణు పరీక్షల నిషేధం ట్రంప్ ప్రకటనతో ముగిసిపోయింది. దక్షిణ కొరియాలోని బుసాన్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశం కావడానికి కొన్ని నిమిషాల ముందు ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అణ్వస్త్ర సంపత్తిలో అమెరికా, రష్యా తర్వాతి స్థానంలో ఉన్న చైనాకు ఇది వ్యూహాత్మక హెచ్చరికగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అణు కార్యక్రమాలను విస్తరించుకుంటున్న రష్యా, చైనాకు దీటుగా పోటీపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు.
‘ఇతర దేశాలు పరీక్షా కార్యక్రమాలు జరుపుతున్న కారణంగా నేను కూడా సమాన స్థాయిలో మన అణు పరీక్షలు మొదలుపెట్టాలని యుద్ధ శాఖను ఆదేశించాను. ఆ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది’ అని ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడిగా తన మొదటి హయాంలో అమెరికా అణ్వస్ర్తాల ఆధునీకరణ, పునరుద్ధరణను పూర్తి చేసిన ఘనత తనకే దక్కుతుందని కూడా ఆయన వెల్లడించారు. అణ్వస్త్ర పరీక్షలకు అపార విధ్వంసక శక్తి ఉన్న కారణంగా తాను దాన్ని ద్వేషించానని, కాని ఇప్పుడు తనకు మరో మార్గాంతరం లేదని ట్రంప్ వివరించారు. గడచిన 30 ఏండ్లకు పైగా అమెరికా నుంచి ప్రత్యక్ష అణు పరీక్షకు సంబంధించిన ప్రకటన వెలువడడం ఇదే మొదటిసారి. 1992 సెప్టెంబర్లో నేవడా పరీక్షా కేంద్రం నుంచి చివరిసారి అణ్వస్త్ర పరీక్ష జరిగింది. తాజా పరిణామాలతో ఆయుధాల నియంత్రణ కోసం ఇప్పటివరకు పోరాడుతున్న అమెరికా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అంతేగాక తన అణ్వస్త్ర సంపన్న శత్రువులతో అమెరికా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది. అమెరికా పూర్తి స్థాయి అణ్వస్త్ర పరీక్షలను చేపడితే దశాబ్దాలుగా అణు పరీక్షలపై ఉన్న ఆంక్షలు తొలగిపోయి అది కొత్తగా ఆయుధాల పోటీకి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయి, అణ్వస్త్ర పోటీకి ప్రపంచ దేశాలు సిద్ధపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు పరీక్షల నిర్వహణకు ఆదేశించారు. అణు ఇంధన సామర్థ్యంతో నడిచే క్రూయిజ్ క్షిపణికి, పోసీడాన్ అణు టార్పెడోకు(సముద్రగర్భంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి) విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.
 
                            