Uttar Pradesh | లక్నో, జూన్ 29: డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఈ వేసవిలో సంభవించిన వందలకొద్దీ వడదెబ్బ మరణాల వెనుక అసలు కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగానే వందమందికిపైగా ప్రజలు మరణించారని కేంద్రం, రాష్ర్టాల్లోని బీజేపీ ప్రభుత్వాలు ఎంత బల్లగుద్ది వాదించినా.. క్షేత్రస్థాయి పరిశీలనలో అసలు కారణాలు బయటపడ్డాయి. రాష్ట్రప్రభుత్వ వైఫల్యమే అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమని మీడియా రిపోర్టులు తేల్చాయి. ఉత్తరప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్ అవ్ధేశ్ వర్మ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.
విద్యుత్తు కోతలు విపరీతంగా ఉండటంతో పగటిపూట ఎండలకు తట్టుకోలేక ఒక్క బల్లియా జిల్లాలోనే 68 మంది చనిపోగా, దేవరియా జిల్లాలో ఈ నెల 21న ఒక్కరోజే 21 మంది మరణించారు.
రోజులో ఏకంగా 10 గంటలు కరెంటు కోతలు విధించారు. ‘కరెంటు లభ్యత ఇక్కడ సమస్య కాదు. ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్తును సరఫరా చేయటానికి విద్యుత్తు లైన్ల సామర్థ్యం సరిపోకపోవటమే సమస్య. చాలాకాలంగా మౌలిక సదుపాయాల కల్పన సరిగా జరగలేదు’ అని అవ్ధేశ్ వర్మ చెప్పారు.