ముంబై, జనవరి 31 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ, దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ముంబైలో గవర్నర్ దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్రకు సునేత్రా తొలి మహిళా డిప్యూటీ సీఎం.
ఎల్పీ నేతగా ఎన్నికైన కొన్ని గంటల్లోనే సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గురించి తనకు తెలియదని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. బారామతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దీని గురించి ఎవరూ నాతో చర్చించ లేదు. బహుశా ఆమె (సునేత్ర) పార్టీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు’ అని ఆయన అన్నారు.
అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీ, ఎన్సీపీ (ఎస్పీ) వర్గాల విలీనం ప్రక్రియకు ఇప్పుడు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని శరద్ పవార్ పేర్కొన్నారు. రెండు వర్గాలు కలిసి పని చేయడం గురించి ఏకాభిప్రాయం కుదిరిందని, దీని ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన తెలిపారు. ‘రెండు వర్గాలు కలువాలన్నది అజిత్ పవార్ కోరిక. అతని కోరిక నెరవేర్చాలన్నదే ఇప్పుడు మా లక్ష్యం’ అని శరద్ పేర్కొన్నారు.
సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో, ఆమె ఖాళీ చేసే రాజ్యసభ స్థానంలోకి పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్‌ను పంపేందుకు రంగం సిద్ధమైంది. పార్థ్ పవార్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
రాజకీయ వారసత్వం గల పాటిల్ కుటుంబంలో సునేత్ర పవార్ జన్మించారు. అజిత్ పవార్‌తో ఆమెకు 1985లో వివాహం జరిగింది. ఆమె రాజకీయాల్లోకి రాక ముందు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సునేత్ర 2024లో తొలిసారి రాజకీయాల్లో అడుగు పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలె చేతుల్లో ఓడి పోయారు. 18 జూన్ 2024న రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.