Kolkata Doctor Case | కోల్‌కతా: దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో కొత్త విషయాన్ని బాధితురాలి తండ్రి వెల్లడించారు. తన కుమార్తె వ్యక్తిగత డైరీలో ఒక పేజీ చిరిగి ఉన్నదని పేర్కొన్నారు. తన కుమార్తె బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక డైరీ ఉంటుందని, దాన్ని తామెప్పుడూ చదవలేదని తెలిపారు. డైరీలో చిరిగిన ముక్కకు సంబంధించిన ఫొటో తన వద్ద ఉందని చెప్పిన బాధితురాలి తండ్రి.. అందులో ఏమున్నదనే వివరాలు వెల్లడించలేదు.
కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడొద్దని తనకు సీబీఐ సూచించిందని అన్నారు. కాగా, ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. మంగళవారం విచారణ జరుపనున్నది. మరోవైపు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ వరుసగా మూడు రోజులు ప్రశ్నించింది. ఘటనకు ముందు, తర్వాత ఆయన ఫోన్స్ కాల్స్‌ను పరిశీలిస్తున్నది.
లై డిటెక్టర్ టెస్టుకు హైకోర్టు అనుమతి
ట్రైనీ డాక్టర్ హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించొచ్చని కలకత్తా హైకోర్టు పేర్కొన్నది. దీంతో కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నిందితుడు సంజయ్ రాయ్‌కు మంగళవారం పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. లై డిటెక్టర్ టెస్టుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 29కు వాయిదా వేసింది.
మమతపై పోస్టు.. విద్యార్థి అరెస్టు
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వివాదాస్పద పోస్టు పెట్టిన కీర్తి శర్మ అనే విద్యార్థిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో మమతకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా, హింసను ప్రేరేపించేలా పోస్టులు పెట్టాడని పోలీసులు ఆరోపించారు. సీఎం మమతను హత్య చేయాలంటూ ఇతరులను ప్రోత్సహిస్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా నిందితుడు హత్యాచార బాధితురాలి గుర్తింపు, ఆమె ఫొటోను కూడా బయటపెట్టాడని తెలిపారు.
బాధితురాలి శరీరమంతా గాయాలే!
హత్యాచారానికి గురైన బాధితురాలి శరీరంలో చాలా చోట్ల గాయాలైనట్టు పోస్టు మార్టం నివేదిక వెల్లడించిందని ఎన్డీటీవీ పేర్కొంది. ఆమెను గొంతు పిసికి హత్య చేశారని, లైంగిక దాడి జరిగినట్టు మెడికల్ ఆధారాలు కూడా ఉన్నాయని నివేదిక కాపీని ఉటంకిస్తూ పేర్కొన్నది. అయితే బాధితురాలి శరీరంలో 150 జీఎం/ఎంజీ వీర్యం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని రిపోర్టు తిరస్కరించింది.
ఆమె శరీరంలో ‘తెల్లటి చిక్కని జిగురు వంటి ద్రవం’ ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపిన పోస్టుమార్టం నివేదిక, అది ఏంటో వెల్లడించలేదు. బాధితురాలికి తల, పెదవులు, ముక్కు, బుగ్గలు, కుడి దవడ, గడ్డం, మెడ, ఎడమ చేయి, ఎడమ భుజం, ఎడమ మోకాలుతో పాటు జననాంగం లోపల కూడా గాయాలు అయ్యాయని నివేదిక తెలిపింది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయిందని, శరీరంలోని ఇతర భాగాల్లో బ్లడ్ క్లాట్స్ అయిందని పేర్కొన్నది.
కేంద్ర దవాఖానల్లో 25% భద్రతా సిబ్బంది పెంపు
న్యూఢిల్లీ, ఆగస్టు 19: కోల్‌కతా రేప్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో తమ ప్రభుత్వ దవాఖానల్లో 25 శాతం భద్రతా సిబ్బందిని పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అవసరాన్ని బట్టి మార్షల్స్ సంఖ్యనూ పెంచాలని ఆదేశాల్లో పేర్కొంది. వైద్యుల సమస్యలపై సలహాలు స్వీకరించేందుకు డీజీహెచ్ఎస్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది.
వైద్యుల కోసం విశ్రాంతి గది, సీసీటీవీ లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దవాఖానల్లో హింసాత్మక ఘటనలు జరిగితే ఆరు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపింది. మరోవైపు సోమవారం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ దవాఖానల్లో జూనియర్ డాక్టర్లు కోల్‌కతా రేప్ ఘటనపై నిరసనలు కొనసాగించారు. న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు.