న్యూఢిల్లీ, జూన్ 13: ఒకరు విశేష అనుభవాన్ని సంపాదించుకుని ఇక త్వరలోనే రిటైర్ అవ్వాలని భావిస్తున్న సీనియర్ పైలట్. మరొకరేమో పౌర విమానయాన కెరీర్లో అద్భుతాలు సృష్టించాలని ఎన్నో కలలతో అదే రంగాన్ని ఎంచుకున్న జూనియర్ పైలట్. వారే కెప్టెన్ సుమీత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ ైక్లెవ్ కుందర్. గురువారం అహ్మదాబాద్‌లో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో అసువులు బాసిన వారిలో ఈ ఇద్దరు పైలట్లు ఉన్నారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయల్దేరిన విమానాన్ని వీరిద్దరే నడుపుతున్నారు.
వీరిద్దరికీ కలిపి 9,300 గంటల విమానం నడిపిన అనుభవం ఉంది. సబర్వాల్ ఒక్కరికే 8,200 గంటల అనుభవం ఉంది. వృత్తిపరమైన నిబద్ధతగల వ్యక్తిగా, ఎప్పుడూ ప్రశాంతంగా అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా విమానయాన సర్కిల్లో పేరుపొందిన సుమీత్ సబర్వాల్‌ని అందరూ ఎంతో గౌరవంగా చూస్తారు. ముంబైలోని పోవై ప్రాంతంలో ఆయన నివాసం. సబర్వాల్ కుటుంబానికి విమానయాన రంగంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. సుమీత్ తండ్రి డీజీసీఏ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఆయన సమీప బంధువులలో ఇద్దరు పైలట్లుగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందే తాను పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు సుమీత్ అనారోగ్యంతో బాధపడుతున్న తన 82 ఏళ్ల తండ్రికి తెలియచేశారు. తన తండ్రి సంరక్షణా బాధ్యతలను ఇక పూర్తి కాలం చూసుకుంటానని కూడా ఆయన మాట ఇచ్చినట్లు శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే చెప్పారు. సుమీత్ కుటుంబాన్ని ఆయన శుక్రవారం పరామర్శించారు.
ఇక కుందర్‌కు 1100 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఆయన కుటుంబంలో కూడా చాలా మంది విమానయాన రంగంలో ఉన్నారు. కుందర్ తల్లి విమాన సిబ్బంది సభ్యురాలిగా పనిచేశారు. ముంబైలోని జుహులోగల బాంబే ఫ్లయింగ్ క్లబ్లో కుందర్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటేనన్స్ కోర్సు ప్రాథమికంగా పూర్తి చేశారు. ముంబైలోని కలీనాలోగల ఎయిరిండియా కాలనీలో పెరిగిన కుందర్ ఆ తర్వాత కుటుంబంతో కలసి బోరివలీకి మకాం మార్చారు. తన సోదరుడి మరణం గురించి తమకు పూర్తి సమాచారం అందలేదని, అతను క్షేమంగానే ఉన్నాడని భావిస్తున్నామని కుందర్ సోదరి ైక్లెన్ హిందుస్థాన్ టైమ్స్‌కి తెలిపారు ఆమె చెప్పారు. తన తండ్రి క్లిఫర్డ్, తల్లి రేఖ తనతోపాటే ఇప్పుడు సిడ్నీలో ఉన్నారని, కుందర్ యోగక్షేమాలు తెలుసుకోవడానికి తాము శుక్రవారం అహ్మదాబాద్ బయల్దేరుతున్నామని ఆమె పేర్కొన్నారు.