పఠాన్‌కోట్: యుద్ధ వ్యూహాల్లో చెప్పుకోదగ్గ ముందడుగు పడింది. భారత సైన్యంలోని ఫ్లూర్-డీ-లిస్ బ్రిగేడ్ విజయవంతంగా ఆత్మాహుతి దాడి చేయగల ఫస్ట్ పర్సన్ వ్యూ (ఎఫ్‌పీవీ) డ్రోన్‌ను పరీక్షించింది. ఇది ట్యాంకుల విధ్వంసకర ఆయుధ సామగ్రిని పైలట్ మార్గదర్శకత్వంలో మోసుకొనిపోగలదు. భారత సైన్యానికి ఇటువంటి డ్రోన్ అందుబాటులోకి రానుండటం ఇదే మొదటిసారి.
సైనికుల కోసం సైనికులు రూపొందించిన ఈ ఆయుధాన్ని పఠాన్‌కోట్ సెక్టర్లో పరీక్షించారు. ఆధునిక యుద్ధ సామగ్రిలో తక్కువ ఖర్చు, అత్యధిక ప్రభావం చూపగలిగే గగనతల దాడుల వ్యవస్థలను అనుసంధానం చేసే దిశగా ఇది గొప్ప ముందడుగు. శత్రువుల ఆయుధాలను అత్యంత కచ్చితత్వంతో కూల్చగలిగే సత్తా వీటికి ఉంది.