న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. మరోవైపు ప్రపంచానికే పొగమంచు రాజధానిగా పేరుపొందిన చైనా రాజధాని బీజింగ్ గడచిన దశాబ్ద కాలంలో వాయు నాణ్యతను గణనీయ స్థాయిలో మెరుగుపరుచుకుంది. గడచిన వారం రోజులుగా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఈ గండం నుంచి గట్టెక్కడానికి చైనీస్ ఎంబసీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న దరిమిలా ఉత్పన్నమయ్యే వాయు కాలుష్యంపైన ఎలా పోరాడాలో భారత్, చైనాకు తెలుసునని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ తన పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి రాత్రికి రాత్రే రాదని, కాని దాన్ని సాధించగలమని ఆమె తెలిపారు. డిసెంబర్ 15న ఢిల్లీలో వాయు ప్రమాణ సూచి(ఏక్యూ) 447 ఉండగా బీజింగ్‌లో 67 పాయింట్లు ఉంది. ఈ రెండు స్క్రీన్షాట్లను ఆమె తన పోస్టులో షేర్ చేశారు.
పాత వాహనాలకు పాతరేసి..
మొదటి దశలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు బీజింగ్ తీసుకున్న చర్యలను ఆమె వివరిస్తూ ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లే పాత వాహనాలను తొలగించి యూరో 6 నిబంధనలను కఠినంగా అమలు చేసినట్లు ఆమె చెప్పారు. లైసెన్స్-ప్లేట్ లాటరీలు, బేసి, సరి సంఖ్య తేదీల్లో వాహనాలపై ఆంక్షలు, మెట్రో, ప్రజారవాణా వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెట్టడం, విద్యుత్తు బస్సులు, వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడం వంటి చర్యలను ఆమె సూచించారు.
భారీ పరిశ్రమలను తరలించి..
రెండవ దశలో పారిశ్రామిక పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించాలని ఆమె తెలిపారు. బీజింగ్‌లో 3,000కు పైగా భారీ పరిశ్రమల మూసివేత లేక వేరే ప్రాంతాలకు తరలింపు జరిగినట్లు చెప్పారు. చైనాలోని అతి పెద్ద ఉక్కు తయారీ సంస్థల్లో ఒకటైన షౌగాంగ్ని వేరే చోటుకు తరలించడంతో 20 శాతం వాయు కాలుష్యం తగ్గినట్లు వివరించారు. ఖాళీ చేసిన ఫ్యాక్టరీల స్థలాలను పార్కులు, వాణిజ్య జోన్లు, టెక్ హబ్‌లుగా మార్చాలని ఆమె సూచించారు.